బ్రాండ్‌ తెలంగాణ

  • మార్మోగుతోన్న నినాదం
  • రియల్, ఐటీ, ఫార్మా గ్రోత్‌ ఫుల్‌
  • ఫ్యూచర్‌పై భారీ అంచనాలు

ధరణి బ్యూరో:
బ్రాండ్‌ తెలంగాణ నినాదం ఇప్పుడు ఐటీ, రియల్‌ ఎస్టేట్, ఫార్మా సెక్టార్‌లలో హాట్‌ టాపిక్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లను వినియోగించుకుంటోంది. ప్రధానంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అంతర్జాతీయ వాణిజ్య సదస్సుతోపాటు నగరంలో జరుగుతోన్న పలు సదస్సుల్లో ఇదే నినాదాన్ని ప్రమోట్‌ చేసి ఎంఎన్‌సీ కంపెనీల దృష్టిని ఆకర్షిస్తుండడం విశేషం. ఆయా వేదికలపై ఆయన టీఎస్‌ ఐపాస్‌ పథకం కింద కేవలం 15 రోజుల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను సింగిల్‌ విండో విధానం ద్వారా జారీ చేస్తున్నామని ఘంటాపథకంగా చెబుతున్నారు. గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రానికి 47 బిలియన్‌ డాలర్ల ఫారెన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చినట్లు ప్రకటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అవసరమైన టీకాల ఉత్పత్తి…బల్క్‌డ్రగ్, ఫార్మా హబ్‌గా మారిన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నట్లు ఎలుగెత్తి చాటుతున్నారు. ఇక రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్ల నుంచి రూ.2.41 లక్షల కోట్లకు చేరినట్లు ప్రకటిస్తున్నారు. ఇక ఐటీ జాబ్స్‌ 3.23 లక్షల నుంచి 9.05 లక్షలకు పెరిగినట్లు వివరిస్తున్నారు. తాజాగా నాస్‌కామ్‌ అంచనాల ప్రకారం టెక్నాలజీ రంగంలో గత రెండేళ్లుగా మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌నుంచే వస్తున్నాయన్న అంచనాలు వెలువడుతుండడం విశేషం. దేశ ఔషధ ఉత్పత్తుల్లో 40 శాతం నగరం నుంచే ఎగుమతి అవుతుండడంతో బ్రాండ్‌ తెలంగాణ నినాదం ఇప్పుడు అన్ని వర్గాల్లో మార్మోగుతోంది. ఇక టీహబ్, టాస్క్, టీ ఫేస్‌ తదితర సంస్థల ద్వారా యువత, యువ పారిశ్రామిక వేత్తలకు విభిన్న రకాల స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణలను అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఈ బ్రాండ్‌ తెలంగాణ నినాదం నగరంలో రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగం జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లేందుకు సైతం దోహదం చేస్తుందని క్రెడాయ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి