టీఎస్‌ రెరాకు జవసత్వాలు..

  • పూర్తిస్థాయిలో అథారిటీ ఏర్పాటు
  • ఆరేళ్ల తరవాత మోక్షం
  • రియల్‌ వర్గాల హర్షాతిరేకాలు
  • చైర్మన్, సభ్యుల పోస్టులకు భారీగా దరఖాస్తులు

ధరణి బ్యూరో:

టీఎస్‌ రెరాకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం జవసత్వాలు కల్పించింది. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్, ఇద్దరు సభ్యులతో పూర్తిస్థాయి అథారిటీని ఏర్పాటు చేయడంతో..ఇక నూతన రియల్‌ వెంచర్లకు , నిర్మాణ రంగ ప్రాజెక్టులకు అనుమతులు చకచకా దక్కనున్నాయి. తాజాగా రెరా చైర్మన్‌గా మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఎన్‌. సత్యనారాయణను ప్రభుత్వం నియమించింది. వాణిజ్య పన్నుల శాఖలో అధనపు కమీషనర్‌గా రిటైర్‌ అయిన జన్ను లక్ష్మీనారాయణ, డైరెక్టర్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారిగా రిటైర్డ్‌ అయిన కె.శ్రీనివాస్‌రావులను సభ్యులుగా నియమించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా 65 సంవత్సరాల వయసు.. ఏది ముందయితే అప్పటివరకు వీరు పదవుల్లో కొనసాగనున్నారు.
చైర్మన్‌ పోస్టుకు భలే డిమాండ్‌..

రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగ ప్రాజెక్టుల నమోదు విషయంలో అత్యంత కీలకంగా పరిగణించే రెరా చైర్మన్‌ పోస్టుకు భలే డిమాండ్‌ నెలకొంది. ఈ పోస్టు దక్కించుకునేందుకు ఏకంగా 37 మంది సీనియర్‌ అధికారులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవం విశేషం. వీరిలో మాజీ చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌కుమార్, ఎస్‌.కె. జోషితోపాటు పలువురు ఇతర అధికారులు , నిర్మాణ రంగానికి చెందిన వారి నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి. ఇక రెండు సభ్యుల పోస్టులకు 59 మంది పోటీ పడ్డారు. కాగా అథారిటీ నియామకానికి వీలుగా ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మార్చి మూడో తేది వరకు మొత్తంగా చైర్మన్, సభ్యుల పోస్టుల కోసం 96 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. మొత్తంగా చట్టం ఏర్పడిన ఆరేళ్ల తరవాత పూర్తిస్థాయిలో అథారిటీ ఏర్పాటుకావడంతో రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి