డాక్యుమెంట్ల పరిశీలనే కీలకం
- ఆస్తి కొనుగొలుకు ముందు అప్రమత్తత అవసరం
- మార్గదర్శకాలు రూపొందించిన సబ్‌రిజిస్ట్రార్ల సంఘం
ధరణి బ్యూరో:
స్థిరాస్తుల క్రయవిక్రయాల్లో డాక్యుమెంట్స్ పరిశీలన అత్యంత కీలకం. లేకుంటే ఇబ్బందులు తథ్యం . ఇటీవలికాలంలో గుడ్డిగా పలువురు మోసపోతున్న సందర్భాలుండడంతో ఈవిషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాట్, ఇల్లు, ఫ్లాట్.. ఇలా ఏదేని ఆస్తిని కొనుగోలు చేసేముందే పలుమార్లు డాక్యుమెంట్లు పరిశీలించుకోవాలి. ఈ విషయాల్లో అప్రమత్తంగా, జాగ్రత్తగా మెలగాలని తెలంగాణ సబ్ రిజిస్ట్రార్ల సంఘం కొన్ని మార్గదర్శకాలను సిద్ధం చేసింది. అవి మీకోసం..
- స్థిరాస్తికి చెందిన రిజిస్ట్రర్డ్ సేల్ డీడ్ తప్పనిసరి.
- స్థిరాస్తికి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్లలో సర్వే నంబర్ సరి చూసుకోవాలి.
- డాక్యుమెంట్ ప్రకారం భౌతికంగా సరిహద్దులు సరిపోలాయా లేదా అనేది చెక్ చేయాలి.
- సదరు ఆస్తి తొలి ఓనర్‌తోపాటు ప్రస్తుత వెండర్ వరకు అన్ని లింక్ డాక్యుమెంట్లు పరిశీలించాలి.
- ఆస్తి ఉన్న లేఅవుట్‌కు స్థానిక సంస్థలు లేదా హెచ్‌ఎండీఏ/డీటీసీపీ, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ తదితర సంస్థల నుంచి అనుమతి ఉందో లేదో వాకబు చేయాలి.
- ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 22(ఏ), నిషేధిత ఆస్తుల పరిధిలో సదరు ఆస్తి ఉండకూడదు.
- ప్లాటు లేదా ఇల్లు/ఫ్లాట్ విక్రయిస్తున్న కంపెనీ గురించి వాకబు చేయాలి.
- ముందస్తు అగ్రిమెంట్లు, మార్టిగేజ్‌లు లేవని నిర్ధారించుకోవాలి.
- ఆస్తిని ప్రత్యక్షంగా చూడాలి. ఫీల్డ్‌లో దాని ఉనికి తెలుసుకోవాలి. ఇందుకోసం సంబంధిత సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) పొందాలి.
- అనుమతి పొందిన లేఅవుట్/ప్లాన్‌కు లోబడి బౌండరీలను ఫీల్డ్‌లో పరిశీలించాలి.
- ఆస్తికి ఒకవేళ జీపీఏ అయి ఉంటే.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు, వాలిడిటీ తదితర అంశాలపై ఆరా తీయాలి.
- ఆస్తి కొనుగోలు తర్వాత తరచూ అక్కడికి వెళ్లి చూస్తుండాలి. హద్దురాళ్లు చెదిరిపోకుండా జాగ్రత్త వహించాలి.