చేవెళ్ల– చందన్‌ వెళ్లికి మహార్ధశ

  • రియాల్టీ, నిర్మాణ ప్రాజెక్టులకు హబ్‌
  • పరిశ్రమల వెల్లువతో పెరగనున్న ఉపాధి అవకాశాలు

ధరణి బ్యూరో:
ఐటీ కారిడార్‌కు చేరువలో… ఔటర్‌కు అరగంట దూరంలో నిలిచిన చేవెళ్ల, ఈ పట్టణానికి 10–12 కి.మీ దూరంలో ఉన్న చందన్‌వెళ్లి ప్రాంతాలు ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ హబ్‌లుగా మారాయి. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, బడా నిర్మాణ రంగ సంస్థలు ఇప్పుడు ఈ ప్రాంతాలపై దృష్టి సారించాయి. బీజాపూర్‌ రహదారి విస్తరణ పనులు ప్రారంభించడంతో ఈ ప్రాంతంలో పెట్టుబడుల వెల్లువ మొదలైంది. శంకర్‌పల్లి మండలంలో విల్లా ప్రాజెక్టుల రాక పెరగడంతో భూముల విలువ ఆకాశాన్నంటింది. దీంతో చేవెళ్ల, షాబాద్‌ మండలాల వైపు వ్యాపారులు దృష్టిసారించారు. కందవాడ, చేవెళ్ల, దామరగిద్ద ప్రాంతాలు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లో రెసిడెన్షియల్‌ జోన్లుగా ఉండడంతో ఈ ప్రాంతంలో నిర్మాణాలు శరవేగంగా పెరుగుతున్నారు. పలు కార్పొరేట్‌ కంపెనీలు ఇక్కడ హౌజింగ్, విల్లా ప్రాజెక్టులు చేపట్టేందుకు భూములు కొనుగోలు చేయడం విశేషం. కుమ్మరిగూడ, షాబాద్‌ పట్టణ కేంద్రాలకు మధ్య ఉన్న 160 ఎకరాల భూములను సేకరించి భారీ వెంచర్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిన విషయం విదితమే.

చందన్‌ వెళ్లికి క్యూ కడుతున్న పరిశ్రమలు..
చేవెళ్లకు 12 కి.మీ దూరంలో ఉన్న షాబాద్‌ మండలం చందన్‌వెళ్లిలో 1650 ఎకరాల భూమిని ప్రభుత్వం పరిశ్రమలకు కేటాయించడంతో ఈ ప్రాంతానికి పలు ప్రధాన పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఇక సీతారాంపూర్‌లో 1100 ఎకరాల భూములను ప్రతిష్టాత్మక కంపెనీలకు కేటాయించడంతో రాబోయే ఐదేళ్లలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. సుమారు 50 వేల మందికి కొలువులు దక్కనున్నట్లు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చేవెళ్ల, షాబాద్, చందన్‌వెళ్లి ప్రాంతాలతోపాటు పరిసర గ్రామాలు రియల్‌ ఎస్టేట్, నిర్మాణ, పారిశ్రామిక రంగాలకు కొంగుబంగారంగా మారతాయని క్రెడాయ్, నరెడ్కో వర్గాలు అంచనా వేస్తున్నాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి