రియల్‌ మార్కెట్‌లో బంపర్‌ ఆఫర్స్‌

  • ఫ్లాటు..ప్లాటు..విల్లా ఏదైనా ఆకర్షణీయమైన తగ్గింపు
  • విశేషంగా ఆకర్షితులవుతోన్న సిటీజన్లు

ధరణి బ్యూరో:
నగర రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఇప్పుడు ఆఫర్ల జాతర నడుస్తోంది. ఓపెన్‌ ప్లాటు.. ఫ్లాటు.. విల్లా.. ఫామ్‌ ప్లాట్స్‌ ఇలా ఏ ప్రాజెక్టు.. వెంచర్‌ అయినా ఇప్పుడు బంపర్‌ ఆఫర్స్‌ సిటీజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఫ్లాట్ల విషయానికి వస్తే హైరైజ్‌ అపార్ట్‌మెంట్లలో పది అంతస్తుల కంటే అదనంగా ఉండే ఫ్లోర్లలో ఫ్లోర్‌ రైజింగ్‌ ఛార్జీలు వసూలు చేయడం పరిపాటే. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో పలు నిర్మాణ రంగ సంస్థలు ఈ ఛార్జీలు వసూలు చేయడం లేదని కస్టమర్లకు భరోసానిస్తున్నాయి. ఇక నగర శివార్లు.. ఔటర్‌కు సమీపంలోని కొన్ని హెచ్‌ఎండీఏ, డీటీసీపీ వెంచర్స్‌లో ప్లాట్లు కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు భరించేందుకు సైతం కొన్ని రియల్టీ సంస్థలు ముందుకొస్తుండడం విశేషం. మరికొన్ని కంపెనీలు తమ ప్రాజెక్టును ప్రారంభించి రెండేళ్లు పూర్తయినా..పాత ధరలకే మీకు ప్లాట్స్‌ను విక్రయిస్తామంటున్నాయి. ఇంకొన్ని నిర్మాణ రంగ సంస్థలు ఫాట్స్‌ కొనుగోలుపై జీఎస్టీని తామే భరిస్తామని ఆఫర్స్‌ ప్రకటిస్తున్నాయి. ఇంకొన్ని సంస్థలు స్పాట్‌ బుకింగ్స్‌పై బంగారు నాణేలను ఆఫర్‌ చేస్తుండడం విశేషం. ఇక కొన్ని కంపెనీలు ఇంటి విలువలో పదిశాతం చెల్లించి..మిగతా మొత్తాన్ని నిర్మాణం పూర్తయ్యాక చెల్లించేలా కస్టమర్లకు బంపర్‌ ఆఫర్స్‌ కూడా ఇస్తుండడం నయా ట్రెండ్‌గా మారింది. ప్రస్తుతం బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీరేట్లు పెంచడం, మార్కెట్‌లో ప్రధానంగా ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంభిస్తున్న కారణంగా నగదు లభ్యత లేకపోవడం తదితర కారణాల వల్లే పలు నిర్మాణ రంగ, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు ఆఫర్ల బాట పట్టినట్లు మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ విశ్లేషిస్తున్నారు. ఈ ఆఫర్ల సీజన్‌ను అనుకూలంగా మలచుకుంటున్న నగర వినియోగదారులు సైతం మంచి ప్రాపర్టీస్‌ను సెలెక్ట్‌ చేసుకునేందుకు ముందుకొస్తున్నట్లు చెబుతున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి