నగరంలో బడా ఈ– వ్యర్థాల శుద్ధి కేంద్రం..
- ఆసియాలో అతిపెద్ద కేంద్రం
- పలు మెట్రోనగరాల వ్యర్థాల శుద్ధికి హబ్
- జూన్ తొలివారం నుంచి షురూ
- ఏటా సుమారు 20 వేల టన్నుల వ్యర్థాల శుద్ధి

ధరణి బ్యూరో:
ఐటీ, అనుబంధ రంగాల క్యాపిటల్‌గా మారిన గ్రేటర్ హైదరాబాద్ నగరంలో బడా ఈ–వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటైంది . ఆసియా ఖండంలోనే ప్రప్రథమంగా లీడ్ ప్లాటినం సర్టిఫికెట్ కలిగిన కేంద్రం ఇదే కావడం విశేషం. దుండిగల్ ప్రాంతంలో 13.6 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. మన దేశానికి చెందిన రిససై్టనబిలిటీ సంస్థ, అమెరికాకు చెందిన రెల్‌డాన్ రిఫైనింగ్ లిమిటెడ్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. ఏటా 20 వేల టన్నుల వ్యర్థాలను శుద్ధి చేసే సామర్థ్యం ఈ ప్లాంటు సొంతం. మొత్తంగా ఈ ప్లాంటు ఏర్పాటుకు రూ.500 కోట్లు వ్యయం చేసినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతుందని..జూన్ మొదటి వారంలో ఈ ప్లాంటు పనిచేయడం ప్రారంభమౌతుందని పేర్కొన్నాయి.
శుద్ధి ప్రక్రియ ఇలా..
ఈ వ్యర్థాల్లో ప్రధానంగా ఉండే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, చిప్స్ నుంచి గోల్డ్, నికెల్, పల్లాడియం తదితర విలువైన లోహాలను సంగ్రహించి శుద్ధి చేయనున్నట్లు ఈ కేంద్రం నిర్వాహకులు తెలిపారు. దశలవారీగా ఫార్మాస్యూటికల్స్, పెట్రోకెమికల్, జ్వెల్లరీ రంగంలో వెలువడే వ్యర్థాలను సైతం శుద్ధి చేయనున్నారు. ప్రస్తుతం ఈ వ్యర్థాల నుంచి అరుదైన లోహాలను సంగ్రహించేందుకు జర్మనీ, బెల్జియం దేశాలకు వ్యర్థాలను పంపించాల్సి వస్తోందని..తమ కేంద్రంతో ఈ పరిస్థితికి చెక్ పెట్టవచ్చని తెలిపారు. కాగా దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరంలో అవ్యవస్థీకృత రంగంలో ఈ– వ్యర్థాలను శుద్ధి చేసేందుకు మూడువేలకుపైగా కేంద్రాలున్నాయన్నారు. నగరంలో నెలకొల్పిన ఈ ప్లాంటు పనిచేయడం ప్రారంభిస్తే బెంగళూరు, ఢిల్లీ, చెన్నై,ముంబాయి, హల్దియా, వైజాగ్ నగరాలకు సంబంధించిన ఈ– వ్యర్థాలను శుద్ధి చేసేందుకు గ్రేటర్‌సిటీ హబ్‌గా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. కాగా మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఈ– వ్యర్థాల ఉత్పత్తి దారుగా ఉండడం గమనార్హం.