మురుగు శుద్ధితో పలు ప్రయోజనాలు..
- వందలాది హౌజింగ్ సొసైటీల్లో నిర్మాణం
- విద్యుత్ రాయితీ కావాలని కోరుతున్న ప్రతినిధులు
ధరణి బ్యూరో:
గ్రేటర్ పరిధిలో గేటెడ్ కమ్యూనిటీలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఇదే క్రమంలో వీటిల్లోని వందలాది నివాసాల నుంచి రోజువారీగా వెలువడే మురుగు నీటిని పర్యావరణ హితంగా శుద్ధిచే సేందుకు విరివిగా మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్‌టీపీ) నిర్మిస్తోన్న ట్రెండ్ బాగా పెరిగింది. వీటిల్లో శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ్, ఫ్లోర్ క్లీనింగ్, టాయిలెట్ ఫ్లషింగ్, కార్ వాషింగ్ తదితర అవసరాలకు వినియోగించే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని ఎన్విరాన్‌మెంటల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ప్రైవేటు ఎస్టీపీలపై చేసిన ఆడిట్ రిపోర్టులో పలు వాస్తవాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం 2021లో నగరంలో వినియోగంలో ఉన్న ప్రైవేటు ఎస్టీపీలు 366 కాగా.. శుద్ధి చేసిన నీటిని వినియోగిస్తున్న కేంద్రాలు 228 వరకు ఉన్నాయి. మరో 138 ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వాడడం లేదని తేలింది. కాగా మురుగు నీటి శుద్ధికి వినియోగిస్తున్న విద్యుత్‌కు యూనిట్‌కు రూ.10 ఖర్చు చేయాల్సి వస్తోందని పలు హౌజింగ్ సొసైటీల ప్రతినిధులు వాపోతున్నారు. విద్యుత్ ఛార్జీల భారంతోనే చాలా గేటెడ్ కమ్యూనిటీల్లో మురుగు నీటిని ఎస్టీపీల్లో శుద్ధి చేయకుండా డ్రైనేజి లైన్లలోకి వదిలేస్తున్నారని చెబుతున్నారు. ఈనేపథ్యంలో..గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రైవేటు ఎస్టీపీల నిర్వహణకు వినియోగించే విద్యుత్‌కు వాణిజ్య టారిఫ్ కాకుండా రాయితీతో విద్యుత్‌ను సరఫరా చేయాలని పలు సొసైటీల ప్రతినిధులు మున్సిపల్ పరిపాలన శాఖను కోరుతున్నారు.