నాచారంపై అందరి నజర్..
- శరవేగంగా నూతన ప్రాజెక్టులు
- ఈ ప్రాంతంపై పెరుగుతోన్న అంచనాలు
- అన్ని ప్రాంతాలకూ ఈజీ కనెక్టివిటీ
- ఐటీ రాకతో పెరిగిన బూమ్
ధరణి బ్యూరో:
నగరానికి తూర్పున విస్తరించిన నాచారం.. ప్రస్తుతం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా ప్రముఖ నివాస కేంద్రంగా మారుతుండటం నయా ట్రెండ్. ఇన్నర్ రింగ్‌రోడ్డు (ఎన్‌హెచ్–163)కు కూతవేటు దూరంలో విస్తరించిన ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు చాలా మంది నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. అన్నిప్రాంతాలతో నాచారానికి కనెక్టివిటీ ఉండడం ప్లస్ పాయింట్. రోడ్డు, రైలు మార్గాలతో నాచారం అనుసంధానం కావడంతో ఈ ప్రాంతానికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. తార్నాక, సికింద్రాబాద్, హబ్సిగూడ, మల్కాజ్‌గిరి తదితర ప్రాంతాలకు కొన్ని నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అలాగే 2 కిలోమీటర్ల దూరంలో మౌలాలి రైల్వే స్టేషన్, మల్కాజ్‌గిరి జంక్షన్ 8 కిలోమీటర్ల పరిధిలో ఉండటంతో ఈజీ జర్నీ సాధ్యపడుతోంది. ఇక ఎంఎంటీఎస్, మెట్రోరైల్ స్టేషన్లు అందుబాటులో ఉండటం అదనపు ఆకర్షణగా మారిందని చెప్పవచ్చు. సమీపంలోని పోచారంలో ఇన్ఫోసిస్ సెజ్ క్యాంపస్ ఉండటమూ కలిసొచ్చింది. అలాగే ఇంటర్నేషనల్ విద్యాసంస్థలు, ఈఎస్‌ఐ హాస్పిటల్, షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్‌లు, హోటళ్లు అధిక సంఖ్యలో ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని తమ నివాస కేంద్రంగా ఎంచుకునే విషయాన్ని పలువురు సిటీజన్లు పరిశీలిస్తుండడం విశేషం.
ఐటీ పార్క్ రాకతో డిమాండ్..
ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వం సైతం తగిన ప్రాధాన్యత ఇస్తోంది. ఇండస్ట్రీయల్ కారిడార్‌గా పేరుగాంచిన ఈ ప్రాంతం.. ప్రస్తుతం ఐటీ రంగాన్ని సైతం అక్కున చేర్చుకుంది. అవుటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపలున్న 11 ఇండస్ట్రీయల్ పార్క్‌లను.. ఐటీ పార్క్‌లుగా మారుస్తూ 2020లో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఐటీకి కేంద్ర బిందువుగా వెస్ట్ కారిడార్ మారింది. ఇలా ఒకే ప్రాంతానికి కాకుండా నగరం నలుచెరుగులా ఐటీ కారిడార్లను తీసుకరావడం వల్ల విస్తృత అభివృద్ధి సాధ్యపడుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసించింది. ఈ నిర్ణయంతో నాచారం ముఖచిత్రం పూర్తిగా మారడంతో.. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో రియల్ బూమ్ శరవేగంతో పెరిగింది.
మధ్యతరగతికి అందుబాటులో ధరలు..
అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ గృహాలు, ఓపెన్ ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పైగా మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో ఇక్కడ నివాసాలు ఉండటాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. రూ.45 లక్షల నుంచి 2బీహెచ్‌కే ఫ్లాట్లు అపార్ట్‌మెంట్లలో లభ్యమవుతున్నాయి. 3 బీహెచ్‌కే ఫ్లాట్లు రూ.70 లక్షలు పలుకుతున్నాయి. ఇంటి అద్దెలకు కూడా విపరీతంగా డిమాండ్ ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో తయారీరంగానికి సంబంధించి అధిక సంఖ్యలో కంపెనీలు ఉండటంతో ఇక్కడ ఉద్యోగులు నివసిస్తున్నారు. షూ, ఫార్మాస్యూటికల్స్, క్లాతింగ్, ఫ్యాబ్రికేషన్, టైర్స్, ఫర్నీచర్, రబ్బర్ తదితర కంపెనీల ఉద్యోగులు అధిక సంఖ్యలో అద్దె ఇళ్లలో ఉంటున్నారు. నెలవారీ అద్దె సగటున డబుల్ బెడ్ రూంకి రూ.15 వేలు, త్రిబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.25 వేలు పలుకుతోంది.
–––