సుజల స్వాప్నికుడు ‘రామేశ్వరుడు’
- భాగ్యనగరానికి కృష్ణా, గోదావరి జలాలు ఉరకలెత్తించిన ఘనత
- తాగునీటి రంగంలో నాలుగు దశాబ్దాలుగా విశేష కృషి
- సివిల్ ,ఎన్విరాన్ మెంట్ ఇంజినీరింగ్‌లో లెజెండ్
- అనితర సాధ్యమైన ప్రాజెక్టులను సాకారం చేసిన కృషీవలుడు
ధరణి బ్యూరో:
అనితర సాధ్యం ఆయన గమ్యం. లక్ష్యం చేరే వరకు విశ్రమించని తత్వం ఆయన నైజం. చేపట్టిన పనిని దైవంగా భావిస్తూ విరామ మెరుగక రేయింబవళ్లు శ్రమించడమే ఆయన సక్సెస్ సీక్రెట్. దాహార్తితో గొంతెండుతోన్న రాజధాని గ్రేటర్ హైదరాబాద్ వాసులకు కమ్మని కృష్ణా, గోదావరి జలసిరులతో గొంతు తడిపిన బృహత్తర ప్రాజెకుల సాకారానికి ఆయన విశేష కృషి చేశారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, గోదావరి జలాలను భాగ్యనగరానికి పరుగులు పెట్టించేందుకు చేపట్టిన కృష్ణా మూడు దశల ప్రాజెక్టులతోపాటు గోదావరి మంచినీటి పథకం మొదటి దశను పూర్తిచేసేందుకు అహరహం శ్రమించారు. ఆయన నిత్య కృషీవలుడు, అలుపెరగని ఇంజినీర్, సుజల స్వాప్నికుడు, ప్రభుత్వ పెద్దలు, సాంకేతిక నిపుణులే కాదు.. విమర్శకుల చేత కూడా ప్రశంసలు పొందిన ఆయన పేరు డాక్టర్ జి.రామేశ్వర్ రావు. వెనుకబడిన పాలమూరు జిల్లాలో జన్మించిన ఆయన.. తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను సాకారం చేసేందుకు సుదీర్ఘ ప్రస్థానం సాగించారు. సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా జలమండలి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ సంస్థలకు వెన్నెముకగా నిలిచి సేవలందించిన ఆయన ప్రస్తుతం ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. నేటితరం ఇంజినీర్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోన్న ఈ దార్శనికుని సుదీర్ఘ ప్రస్థానం సాగిందిలా..
సివిల్, ఎన్విరాన్‌మెంట్ రంగాల్లో ఉన్నత విద్య..
జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. అదే విశ్వవిద్యాలయం నుంచి ఎంటెక్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌ను పూర్తిచేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తిచేశారు.
ఇంజినీర్‌గా ప్రస్థానం మొదలు..
1981లో పబ్లిక్ హెల్త్ విభాగంలో ఇంజినీర్‌గా ప్రస్థానం మొదలు పెట్టారు. జలమండలిలో సుమారు 36 సంవత్సరాలపాటు వివిధ హోదాలలో పనిచేస్తూ తన పదవికి వన్నె తెచ్చారు. ఏఈ,ఏఈఈగా 1981 నుంచి 1996 వరకు పనిచేశారు. ఇక 1999 నుంచి 2002 వరకు డీజీఎంగా సేవలందించారు. 2009లో చీఫ్ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టి గ్రేటర్ హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చే పలు మంచినీటి పథకాలతోపాటు మౌలిక సదుపాయల కల్పన ప్రాజెక్టులను సాకారం చేసేందుకు విశేషంగా కృషిచేశారు. 2014 నుంచి 2017 మధ్య కాలంలో జలమండలిలో ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్‌గా కీలకబాధ్యతలు నిర్వహించారు.
అనితర సాధ్యమైన ప్రాజెక్టుల సాకారం..
తన సుదీర్ఘ కెరీర్‌లో నగరానికి కృష్ణా ఫేజ్–1,2,3 దశలతోపాటు గోదావరి మొదటి దశ ప్రాజెక్టు, ఎన్‌ఆర్‌సీడీ మొదటి దశ, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం తదితర ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. తన పనితీరుతో ప్రభుత్వ వర్గాలతోపాటు ప్రజల నుంచి విశేషంగా మన్ననలు పొందారు.
పలు కీలక సంస్థల్లో సభ్యత్వం..
- ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఆఫ్ ఇండియా సభ్యులు.
- ఇంటర్నేషనల్ వాటర్ అసోసియేషన్‌లో సభ్యులు.
- ఇండియన్ వాటర్ వర్క్స్ అసోసియేషన్(ఐవా) జీవితకాల సభ్యులు.
- అమెరికన్ వాటర్ వర్స్క్ అసోసియేషన్ సభ్యులు.
- ఫెలోæ ఆఫ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ టెక్నికల్ అర్భిట్రేటర్స్.
- ఫెలో ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్ ఇండియా.
- ఇండియన్ కాంక్రీట్ ఇన్‌స్టిట్యూట్‌లో జీవితకాల సభ్యులు.
- ఇండియన్ బిల్డింగ్ కాంగ్రెస్‌లో జీవిత కాల సభ్యులు.
- అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అసోసియేషన్‌లో జీవిత కాలసభ్యులు.
- ఇండియన్ రోడ్ కాంగ్రెస్‌లో జీవితకాల సభ్యులు.
- క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియాలో జీవిత కాల సభ్యులు.
- సోలార్ ఎ నర్జీ సొసైటీ ఆఫ్ ఇండియాలో జీవిత కాల సభ్యులు.
- ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ జీవితకాల సభ్యులు.
కృషీవలునికి అవార్డుల పంట..
- జలమండలిలో విశేష సేవలందించినందుకు 30.11.2004న ఔట్‌స్టాండింగ్ సర్వీస్ అవార్డు దక్కింది.
- కృష్ణా, గోదావరి తాగునీటి పథకాలతోపాటు ఇతర మౌలిక సదుపాయల కల్పన ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేసినందుకు ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి పలు ప్రశంసా పత్రాలు లభించాయి.
- కృష్ణా ఫేజ్ –1,2,3 దశల ప్రాజెక్టులను పూర్తిచేసినందుకు ప్రభుత్వ వర్గాలతోపాటు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కాయి.
- ఇన్‌స్టిట్యూషన్∙ఆఫ్ ఇంజినీర్స్ సంస్థ 2012లో బెస్ట్ డిజైన్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ అవార్డును రామేశ్వర్‌రావుకు ప్రధానం చేసింది.
- 2018లో న్యూఢిల్లీకి చెందిన ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా సంస్థ ఎమినెంట్ ఇంజినీర్ అవార్డ్‌ను ప్రధానం చేసింది.
ఐఈఐలో ప్రస్థానం ఇలా..
- 2016–18 మధ్యకాలంలో ఐఈఐ గౌరవ కార్యదర్శిగా పనిచేశారు. సుమారు 220కి పైగా సదస్సులు, జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్సులు ఇతర ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించారు.
- 2018–20 మధ్యకాలంలో ఐఈఐ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సెమినార్లను నిర్వహించారు.
- డాక్టర్ జి. రామేశ్వర్ రావు చైర్మన్‌గా పనిచేసిన కాలంలో ఐఈఐ తెలంగాణ స్టేట్ సెంటర్ బెస్ట్ స్టేట్ సెంటర్‌గా ఎంపికైంది. ఇక 2018–19,2019–20,2020–21 సంవత్సరాల్లో బెస్ట్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్ సాధించింది.
- తాగునీరు, మురుగునీటి పథకాలపై 30 పరిశోధన పత్రాలను సిద్ధంచేసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సమర్పించారు. అనేక సదస్సుల్లో గెస్ట్ లెక్చర్లు ఇచ్చారు.
- 2020 ఆగస్టు నుంచి ఈఎస్‌సీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.