భార లోహాల మూసీ..

  • ఏటేటా పెరుగుతోన్న భారలోహాల మోతాదు
  • నష్టనివారణ చర్యలు తీసుకోవాలని నిపుణుల సూచన
  • ఎన్‌జీఆర్‌ఐ, జేఎన్‌టీయూ పరిశోధనలో తేలిన వాస్తవాలు

ధరణి బ్యూరో:
రాష్ట్ర రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌ మీదుగా ప్రవహిస్తోన్న చారిత్రక మూసీ నదిలోకి గృహ, వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థజలాల చేరికతో భార లోహాల మోతాదు క్రమంగా పెరుగుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఈ నీటితో సాగుచేసిన పంటల్లో వీటి ఆనవాళ్లున్నట్లు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని నేషనల్‌ జియో ఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్సిట్యూట్, జవహర్‌ లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)ల తాజా పరిశోధనలో పలు విషయాలు వెల్లడయ్యాయి. మూసీ నీటితో గత నాలుగేళ్లుగా సాగుచేస్తోన్న పంటల్లోనే భారలోహాల ఉనికి బయటపడినట్లు తాజా పరిశోధన నివేదిక స్పష్టం చేసింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో నేల, నీరు, పంటల నమూనాలను సేకరించి పరిశోధించగా ఈ విషయం బయట పడింది. భారలోహాల చేరికతో సమీప భవిష్యత్‌లో పరివాహక ప్రాంతాల ప్రజలు క్యాన్సర్‌ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉన్నట్లు ఆందోళన వ్యక్తంచేసింది. లెడ్‌ ఆనవాళ్లుండడం, జీవ వ్యర్థాల చేరిక, పరివాహక ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో లవణీయత పెరగడం వంటి విపరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలిపింది. ఆటోమోబైల్‌ రంగం నుంచి వెలువడే వ్యర్థాలు, వాడి పడేసిన ఎలక్ట్రికల్‌ బ్యాటరీల వ్యర్థాల చేరికతోనే ఈ అనర్థాలు తలెత్తినట్లు పేర్కొంది. ఈ పరిశోధన వివరాలను ‘ఇంపాక్ట్‌ ఆఫ్‌ ఆర్భన్‌ వేస్ట్‌ వాటర్‌ రీ యూజ్‌ ఫర్‌ ఇరిగేషన్‌ ఆన్‌ హైడ్రో–అగ్రో–ఎకలాజికల్‌ సిస్టమ్స్‌ అండ్‌ హ్యూమన్‌ హెల్త్‌ రిస్క్‌ : ఏ కేస్‌ స్టడీ ఫ్రమ్‌ మూసీ రివర్‌ బేసిన్‌∙సౌత్‌ ఇండియా’ పేరుతో హైడ్రో రీసెర్చ్‌ అనే పరిశోధన పత్రంలోనూ ప్రచురించారు. ఆహార పదార్థాల్లో క్యాన్సర్‌ కారకమైన భారలోహాలు చేరితే ఇవి పంటల ద్వారా మానవుల్లోకి ప్రవేశించి విపరిణామాలు తలెత్తుతాయని ఈ పరిశోధన పత్రం స్పష్టంచేసింది. కాగా ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతాల్లో నేల,నీరు, భూగర్భ జలాల్లో భారలోహాల పరిమితి నామమాత్రంగానే ఉందని.. భవిష్యత్‌లో నష్టనివారణ చర్యలు చేపట్టని పక్షంలో అనర్థాలు తప్పవని ఈ నివేదిక హెచ్చరించింది. కాగా గత నాలుగేళ్లుగా పరివాహక ప్రాంతాల్లో చిన్నారులు, టీనేజి యువత, మహిళలు, పురుషుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిందన్న అంశంపైనా ఎన్‌జీఆర్‌ఐ, జేఎన్‌టీయూ నిపుణులు పరిశోధించారు. ప్రస్తుతానికి పరిస్థితులు శృతిమించలేదని తెలిపారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి