‘రియల్’ గ్రోత్ ఆశాజనకం
- 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆశించిన స్థాయిలో వృద్ధి
- దేశ వ్యాప్తంగా ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్
- రియల్ ఎస్టేట్, ఎకానమీ, ఐటీ రంగాల నిపుణులు రవి
ధరణి బ్యూరో:
దేశ వ్యాప్తంగా, రాష్ట్ర రాజ ధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2023–24 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ వృద్ధిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ’ అంచనాల మేరకు మన దేశంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు , ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.3.5 లక్షల కోట్ల మేర లావాదేవీలు జరుగుతాయని అంచనా వేయడం విశేషం. ఇదే తరహాలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా స్థిరమైన అభివృద్ధిని సాధించడం తథ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో నివాస, వాణిజ్య ఆస్తులకు ఇటీవలి కాలంలో భారీగా డిమాండ్ పెరిగింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ఇటీవలి నివేదిక ప్రకారం దేశ రాజధాని ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పూణె, హైదరాబాద్, చెన్నై మహానగరాల్లో సగటు ఆస్తి ధరలను పోల్చింది.
ధరలు అనుకూలం..
మన సిటీలో సగటు ప్రాపర్టీ ధర చదరపు అడుగుకు రూ.4,620 వరకు ఉందని, ఇతర మెట్రో నగరాల్లోని సగటు ప్రాపర్టీ ధరల కంటే ఈ మొత్తం తక్కువగా ఉందని, అన్ని వర్గాల బడ్జెట్‌కు తగినట్లుగా అనుకూలమైన ధరలున్నట్లు పేర్కొనడం విశేషం. అయితే ఈ మధ్యకాలంలో గృహ రుణాలపై వడ్డీ రేట్లు 9.5 శాతం కంటే అధికంగా పెరిగితే, హౌసింగ్ డిమాండ్ తగ్గుముఖం పడుతుందని అనరాక్ వినియోగదారుల సెంటిమెంట్ సర్వే రీడింగ్ పేర్కొనడం గమనార్హం. కాగా ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆర్‌బీఐ సమావేశంలో రెపోరేటును 6.5 వద్ద మార్చకుండా ఉంచడంతో హౌసింగ్ మార్కెట్‌కి అనుకూలంగా మారింది. రెసిడెన్షియల్ ఫ్లాట్స్, విల్లాల మార్కెట్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రముఖ రియాల్టీ విశ్లేషణ సంస్థ .. ప్రాప్‌టైగర్ డేటా ప్రకారం, జనవరి–మార్చి కాలంలో హైదరాబాద్‌లో గరిష్టంగా 55 శాతం వృద్ధితో 10,200 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు తేలింది. ఏడాది క్రితం కేవలం 6,560 యూనిట్లు మాత్రమే విక్రయించారు. నూతన ప్రాజెక్టుల లాంచ్‌లు క్రమంగా పెరిగినట్లు ఈ సంస్థ వెల్లడించింది. రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌కు ఇది మంచి పరిణామం అని చెప్పవచ్చు. నిలకడగల వృద్ధితో వారిలో క్రమంగా మార్కెట్‌పై విశ్వాసం పెరుగుతోంది. పెరుగుతోన్న డిమాండ్‌కు తగినట్లుగా నూతన ప్రాజెక్టులను చేపట్టే దిశగా వారిని ప్రోత్సహిస్తోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరిగేందుకు కారణాలివే..
- నగర రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి ప్రధానంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి) ఒకటి. నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదం చేసింది. వరుస ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌లతో పలు కూడళ్లు, ప్రయాణీకులకు ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి లభించింది. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం సాధ్యపడుతోంది. సమయాన్ని ఆదా చేస్తుంది.
- కాస్ట్ ఎఫెక్టివ్ ప్రాపర్టీలు: అద్దె గృహాలు, అపార్ట్‌మెంట్‌లలో ఫ్లాట్‌లు ,ప్లాట్స్, విల్లాల ధరలు ఇతర నగరాలతో పోలిస్తే తక్కువకే లభిస్తున్నాయి. ఇంటి అద్దెలు కూడా నగరంలో తక్కువే కావడం విశేషం.
- కమర్షియల్ హబ్: బెంగళూరు తర్వాత ఉత్తమ వాణిజ్య గమ్యస్థానం హైదరాబాద్ మాత్రమే.
- పెద్ద ఐటి మరియు ఫార్మా కంపెనీలు : హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ ఒక్క ఐటీ రంగం మాత్రమే కాదు. ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ వంటి అనేక ఇతర పరిశ్రమలు బాగా పనిచేస్తున్నాయి. నివసించడానికి, పని చేయడానికి నగరం అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంది.
- వేగవంతమైన పట్టణీకరణ: మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం.. జిల్లాలవారీగా హైదరాబాద్‌కు అనుసంధానం చేయడం వల్ల హైదరాబాద్ నగరంలో ఈ దశాబ్దంలో వేగవంతమైన పట్టణీకరణను సొంతం చేసుకుంది. భారతదేశంలోని మరే ఇతర నగరంలో ఈ స్థాయిలో పట్టణీకరణ జరగలేదు.
- హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఎన్నారైలు పెట్టుబడులు పెడుతున్నారు. నగరంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోకి ఇటీవలి కాలంలో కెనడా, గల్ఫ్, యూరప్ మొదలైన దేశాల్లో నివసిస్తున్న నాన్–రెసిడెంట్ ఇండియన్స్ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. వారి ఫస్ట్ ఛాయిస్ హైదరాబాద్ మాత్రమే అంటే అతిశయోక్తి లేదు.