యూత్ గోల్.. ‘ ఓన్ హౌజ్’
- ఇళ్ల కొనుగోళ్లలో 24–42 వయో గ్రూపు వారే అత్యధికం
- సీబీఆర్‌ఈ తాజా నివేదికలో వెల్లడి
- రెండేళ్లలో ఇంటి కొనుగోలే 44 శాతం మంది లక్ష్యం
ధరణి బ్యూరో:
దేశ వ్యాప్తంగా సొంతిళ్ల కొనుగోళ్లలో యువత పైచేయిగా నిలుస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలిస్తే ప్రధానంగా 24 నుంచి 42 ఏళ్ల వయోగ్రూపు మధ్యనున్న వారే అత్యధికంగా ఇండిపెండెట్ ఇళ్లు, ఫ్లాట్స్, ప్లాట్లు కొనుగోలు చేస్తుండడం విశేషం. రాబోయే రెండేళ్లలో సుమారు 44 శాతం మంది యువత సొంతింటి కలను సాకారం చేసుకునే కృషిలో ముందుంటారని సీబీఆర్‌ఈ సంస్థ తాజా నివేదిక తెలిపింది. విశ్వవ్యాప్తంగా పరిశీలిస్తే మన దేశంలోనే ఈ ట్రెండ్ అధికంగా ఉన్నట్లు ఈ సంస్థ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాలు, చిన్న పట్టణాల్లో తక్కువ ధరకు లభించే బడ్జెట్ ఫ్లాట్స్, ఇళ్ల కొనుగోలుకే యూత్ మొగ్గు చూపుతున్నారట. ఇంటి మీద పెట్టుబడులే దీర్ఘకాలంలో తమ భద్రతకు భరోసా అని భావిస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది. కోవిడ్ అనంతర కాలంలో.. ప్రస్తుతం అన్ని కార్యాలయాలు యధావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తుండడంతో యూత్ తాము పనిచేస్తున్న పట్టణాలకు విధిగా తరలి వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఇళ్ల కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
యూత్ కలలు సాకారం ఇలా..
ఇంటి కొనుగోలుకు యువతకు పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేస్తుండడం, సులభ వాయిదాలు, ఆకర్షనీయమైన వడ్డీ రేట్ల కారణంగా పలువురు యువత సులభంగా హోమ్ లోన్స్ పొందుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. అద్దె ఇళ్లలో ఉండే కంటే సొంతిళ్ల కొనుగోళ్లకు సుమారు 40 శాతం మంది యువత ప్రాధాన్యత నిస్తున్నారట. ఇక మరో 20 శాతం మంది అద్దె ఇళ్లలో ఉండేందుకు మక్కువ చూపుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది. మరో 17 శాతం మంది తాము పనిచేస్తున్న నగరాల్లో వర్కింగ్ మెన్స్ లేదా ఉమెన్స్ హాస్టల్స్‌లలో నివసించడం లేదా షేరింగ్ విధానంలో ఇతరులతో కలిసి అద్దెకు ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారట. కోవిడ్ తరుణంలో ఇళ్లకే పరిమితం కావడంతో చాలా మంది యువత ఆలోచనల్లో మార్పు వచ్చిందని.. సొంతిళ్లు కలిగి ఉంటేనే భవిష్యత్‌లో తమకు ఎలాంటి బాదరాబందీ ఉండదని భావించడానికి కారణమని ఈనివేదిక స్పష్టం చేసింది. వినోదం, టూర్స్ పై పెట్టే పెట్టుబడి కంటే ఇంటి మీద పెట్టుబడే తమకు రక్షణ అని యూత్ భావిస్తున్నట్లు కంట్రీ గ్రూప్ సంస్థ ఎండీ అమిత్ తెలిపారు. భవిష్యత్‌లో ఇంటి అద్దెలు పొందే వెసులుబాటు ఉండడం కూడా యూత్ ఆలోచన మారేందుకు కారణమని ఈ నివేదిక తెలిపింది. తమ పెట్టుబడులకు భద్రత, తాము కొనుగోలు చేసే ఇళ్ల నాణ్యత, మన్నిక, లొకేషన్,తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరవాతనే యూత్ ఇళ్లను కొనుగోలు చేస్తుండడం నయా ట్రెండ్.