సొంతిల్లు ప్రతిఒక్కరి నినాదం

  • కోవిడ్‌ తరవాత ఇదీ ట్రెండ్‌
  • ఇళ్ల కొనుగోలులో యువతదే పైచేయి
  • లక్షలాది మందికి ఉపాధి చూపుతున్న రియల్, నిర్మాణ రంగాలు
  • ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి పథకాలే ఈ రంగాలకు బూస్టప్‌
  • ‘ధరణి’తో నరెడ్‌కో తెలంగాణ అధ్యక్షులు బి. సునీల్‌ చంద్రారెడ్డి
నరెడ్‌కో తెలంగాణ విభాగం అధ్యక్షులు బి.సునీల్‌ చంద్రారెడ్డి

ధరణి బ్యూరో:
కోవిడ్‌ తరవాత అన్ని ఆదాయ వర్గాల వారికి సొంతిల్లు అత్యవసరంగా మారాయని.. ఇళ్లు, కార్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌(నరెడ్‌కో) తెలంగాణ విభాగం అధ్యక్షులు బి.సునీల్‌ చంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా, ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగ ట్రెండ్స్‌పై ప్రముఖ రియల్‌ ఎస్టేట్, నిర్మాణం, పర్యావరణ రంగాల మ్యాగజైన్, వెబ్‌సైబ్‌ ‘ ధరణి మైత్రి’ కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు, సుస్థిర ప్రభుత్వం వంటివన్ని రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగాలు వృద్ధి సాధించేందుకు దోహదం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్‌ డాలర్లకు చేరువైందన్నారు. ఇదే వృద్ధి కొనసాగి 2047 నాటికి మన దేశం 25 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపారు. అమెరికా,యూరప్‌ ,ఆస్ట్రేలియా తోపాటు ఆసియా ఖండంలోని పలు ఇతర దేశాలు, ఆఫ్రికా దేశాల్లో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలు ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌పై దృష్టిసారించారన్నారు. నగరంలో చేపడుతున్న పలు రియల్‌ ఎస్టేట్,నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో భారీగా ఇన్వెస్ట్‌ చేసేందుకు ముందుకురావడం ఇటీవలి కాలంలో బాగా పెరిగిందన్నారు. వివిధ అంశాలపై సునీల్‌ చంద్రారెడ్డి అభిప్రాయాలివీ..

ధరలు పెరిగినా.. తగ్గని అమ్మకాలు
కోవిడ్‌ అనంతరం సిమెంటు, స్టీలు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్‌ తదితర సామాగ్రి ధరలతోపాటు కూలీల వేతనాలు 25 నుంచి 28 శాతం పెరగడంతో ఇళ్ల ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. అయినా నగరంలో ఫ్లాట్స్, విల్లాలు, ప్లాట్లు, కమర్షియల్‌ స్పేస్, ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ ఏమాత్రం తగ్గలేదు. అమ్మకాల్లో నిలకడగల వృద్ధి నమోదవుతుంది.

రియల్‌, నిర్మాణ రంగంలో లక్షలాది మందికి ఉపాధి
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 15 లక్షల మంది ప్రత్యక్షంగా రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా సుమారు 50 నుంచి 60 లక్షల మందికి ఈ రెండు రంగాలు ఆదరువుగా ఉన్నాయి. ఉపాధి అవకాశాలు ఈ రంగంలో ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. ప్రై వేటు రంగంలో అత్యధిక మందికి ఈ రెండు రంగాలు ఉపాధి కల్పిస్తున్నాయి. రియల్, నిర్మాణ సెక్టార్‌ల వృద్ధితో సుమారు 60 రకాల వ్యాపారాల అభివృద్ధి ఆధార పడి ఉంది.

ప్రభుత్వ విధానాలు భేష్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్‌ ఐపాస్, బీపాస్, ఐటీ, హార్డ్‌వేర్‌ పాలసీలతోపాటు ఫార్మాసిటీ ఏర్పాటు, ఫాక్స్‌కాన్‌ వంటి కార్పొరేట్‌ సంస్థల రాక వంటి పరిణామాలు రియల్‌ ఎస్టేట్,నిర్మాణ రంగం వృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఏటా ఐటీ రంగంలో వేలాదిగా నూతన కొలువుల సృష్టి సాధ్యపడుతోంది. వీరిలో చాలా మంది సొంతిల్లు, ప్లాట్లు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కూల్‌ రూఫ్‌ టాప్‌ పాలసీతో ఇంటి లోపలి ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. కరెంట్‌ వినియోగం తగ్గించవచ్చు. రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీల మేర పెరిగే అవకాశాలుండడంతో రేడియేషన్, అధిక వేడిమి నుంచి ప్రజలను కాపాడేందుకు ఈ రూఫ్‌టాప్‌ పాలసీ దోహదం చేస్తుంది. చెరువుల ప్రక్షాళన, సుందరీకరణకు పలు నిర్మాణ రంగ కంపెనీలు ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందుకొస్తుండడంతో చెరువుల పరిసరాల్లో నివసించే సిటీజన్లు స్వచ్ఛమైన ఆక్సీజన్‌ పీల్చుకోవడంతోపాటు ఆహ్లాద కరమైన వాతావరణంలో గడిపేందుకు అవకాశం దక్కనుంది. నగర పర్యావరణం కూడా గణనీయంగా మెరుగుపడుతుంది.

గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రిలో భారీ డైనింగ్‌ హాల్‌

సమాజ హితం.. నరెడ్‌కో అభిమతం
నరెడ్‌కో తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతుండడం విశేషం. కోవిడ్‌ తరుణంలో రోగులు,వారి బంధువులను ఆదుకునేందుకు ఇస్కాన్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షయ పాత్ర పథకానికి 2020లో రూ.21 లక్షలు డొనేట్‌ చేశారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం కింద గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రిలో భారీ డైనింగ్‌ హాల్‌ను నరెడ్‌కో సౌజన్యంతో నిర్మించారు. నగర వ్యాప్తంగా కోవిడ్‌ తరుణంలో పదికి పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. వెటరన్‌ సోల్జర్‌ బైక్‌ ర్యాలీకి సహకరించారు. అంటార్కిటికా సాహస యాత్ర చేపట్టిన క్లైమెట్‌ ఫోర్స్‌ బృందానికి ఇతోధికంగా సాయం అందించారు. ఇక 2004లో ప్రకాశం జిల్లాలో సునామీ విలయ తాండవంలో నష్టపోయిన బాధితులకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. పర్యావరణ స్పృహతో పలు సందర్భాలలో జూట్‌ బ్యాగులను పంపిణీ చేశారు. వివిధ అభివృద్ధి పథకాలు చేపట్టే సమయంలో భారీ వృక్షాలను నరికివేయకుండా..వేరొక చొట పదిలంగా నిలబెట్టేందకు ట్రీస్‌ ట్రాన్స్‌లొకేషన్‌ కార్యక్రమాన్ని నరెడ్‌కో చేపట్టి పలువురి ప్రశంసలు అందుకుంది. 2010లో మహబూబ్‌నగర్,కర్నూలు జిల్లాల్లో వరద బాధితులకు ఫ్లడ్‌ హౌజ్‌లను నిర్మించి అందజేశారు. జీహెచ్‌ఎంసీ సైక్లింగ్‌ ట్రాక్‌కు 2012లో 200 సైకిళ్లను బహూకరించారు. నిరుపేదలకోసం పలు మార్లు ఉచిత వైద్య శిబిరాలను నరెడ్‌కో నిర్వహించింది. కాప్‌–2011 సదస్సు సందర్భంగా హైటెక్స్‌ పరిసరాల్లో రహదారుల సుందరీకరణకు నరెడ్‌కో సహకరించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నరెడ్‌కో క్రియాశీలకంగా వ్యవహరించి వేలాది మొక్కలు నాటింది. ఆకు పచ్చని తెలంగాణా సాధన కృషిలో పాలుపంచుకొని అన్ని వర్గాల మన్ననలు పొందడం విశేషం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి