మౌలిక వసతులతో ‘రియల్‌’ బూమ్‌

  • రియల్టీపై ఆశలు కల్పిస్తున్న కొత్త ప్రాజెక్టులు
  • వచ్చే ఐదేళ్లలో విస్తృత వృద్ధిపై అంచనాలు

ధరణి బ్యూరో:
రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌ నలుచెరుగులా ప్రభుత్వం నూతనంగా అభివృద్ధి చేస్తోన్న మౌలిక వసతుల ప్రాజెక్టులు రియల్‌ బూమ్‌ను మరింత పెంచుతాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. నయా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులతో రాబోయే ఐదేళ్లలో మహానగరం చుట్టూ రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలకు ఢోకా ఉండబోదని ఆ రంగం నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుండటంతో రియల్టీ వర్గాలకు బూస్టప్‌ నిస్తోంది.

కొత్తగా ప్రాజెక్టులొచ్చెనే..
ఇప్పటికే నగరంలో 69.2 కి.మీ మార్గంలో అందుబాటులోకి వచ్చిన మెట్రో రైల్‌ ప్రాజెక్టుతోపాటు ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో ప్రాజెక్టు పనులు మొదలు కావడం, మణిహారం లాంటి అవుటర్‌ రింగ్‌ రోడ్‌ అందుబాటులోకి రావడం, శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు కొత్తగా పలు ప్రాజెక్టులకు ప్రభుత్వం అంకురార్పణ చేస్తోన్న విషయం విదితమే. రాయదుర్గం నుంచి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు, బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపుల్, నాగోల్‌ నుంచి ఎల్బీనగర్, ఇక్కడి నుంచి హయత్‌నగర్‌కు మెట్రో విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికితోడు అవుటర్‌కు వెలుపల తొమ్మిది జిల్లాలను కలుపుతూ 350 కిలోమీటర్ల మేర రీజినల్‌ రింగ్‌రోడ్డు ఏర్పాటుకు చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ రహదారులను కలుపుతూ యాచారం, కడ్తాల్‌ మండలాల్లో 19 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మాసిటీ నెలకొల్పేందుకు ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. వీటికి అదనంగా నగరానికి తూర్పు దిశలో విస్తరించిన రాచకొండ గుట్టల్లో ఫిల్మ్‌సిటీ, ఎడ్యుకేషన్‌ సిటీ, స్పోర్ట్స్‌ సిటీల ప్రణాళికలు సిద్ధం చేసింది. కొంగరకలాన్‌లో 200 ఎకరాల విస్తీర్ణంలో ఫాక్స్‌కాన్‌ సంస్థ అందుబాటులోకి రానుంది. వేలాది మందికి ఉపాధి కల్పించనుంది. నగరంలోని మూసీ నదిపై 55 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం ప్రతిపాదన దశలో ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ రియల్‌ వృద్ధికి ఇతోధికంగా దోహదం చేస్తాయని క్రెడాయ్, నరెడ్‌కో వర్గాలు ఆశాబావం వ్యక్తం చేస్తున్నాయి. మౌలిక వసతులు అందుబాటులోకి రావడం ద్వారా ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తాయి. తద్వారా పరిసర ప్రాంతాల్లో నివాస సముదాయాలు భారీగా నెలకొంటాయి. ఫలితంగా ప్లాట్లు, ఇండిపెండెంట్‌ హౌజ్‌లు, విల్లాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి