మరో పదిహేనేళ్లు గోల్డెన్‌ పీరియెడ్‌

  • క్రెడాయ్‌ హైదరాబాద్‌ జనరల్‌ సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి
  • ప్రస్తుతం లగ్జరీ విల్లాలు, ఆకాశ హార్మ్యాలకు డిమాండ్‌
  • వచ్చే ఐదేళ్లు అపర్ఢబుల్‌ హౌజ్‌లకే గిరాకీ అధికం
  • ప్రభుత్వ విధానాలూ రియల్,నిర్మాణ రంగానికి అనుకూలం

ధరణి బ్యూరో:
రాబోయే పదిహేనేళ్ల పాటు రాష్ట్ర రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంతోపాటు నగరానికి వంద కిలోమీటర్ల పరిధి వరకు రియల్టీ,నిర్మాణ రంగానికి బంగారు భవిష్యత్తు ఉందని,నిలకడగల అభివృద్ధి తథ్యమని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా( క్రెడాయ్‌) హైదరాబాద్‌ చాప్టర్‌ జనరల్‌ సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టీఎస్‌ ఐపాస్, బీ–పాస్, ఐటీ, హార్డ్‌వేర్‌ పాలసీలతోపాటు తాజాగా ప్రవేశపెట్టిన కూల్‌ రూఫ్‌ టాప్‌ పాలసీలు నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నిర్మాణ రంగంలో నెలకొన్న తాజా ట్రెండ్‌ పై ఆయన ప్రముఖ రియల్‌ ఎస్టేట్, నిర్మాణ, పర్యావరణ రంగాల మాస పత్రిక, ‘ధరణీ మైత్రి’ వెబ్‌సైట్‌కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివిధ అంశాలపై రాజశేఖర్‌రెడ్డి అభిప్రాయాలివీ..

పదిహేనేళ్ల వరకు బేఫికర్‌..
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంతోపాటు రాష్ట్రం నలుచెరుగులా రియల్‌ ఎస్టేట్,నిర్మాణ రంగం శరవేగంగా పురోగమిస్తోంది. వచ్చే 15 ఏళ్ల పాటు ఈ రంగాలకు ఎలాంటి ఢోకా లేదు. మాంద్యం ఛాయలు అసలే లేవు. నగరంలో ఐటీ, హార్డ్‌వేర్, బల్క్‌డ్రగ్, మాన్యుఫాక్చరింగ్‌, బయోటెక్, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో వందలాదిగా వెలుస్తున్న నూతన కంపెనీలతో వేలాదిగా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. దీంతో నిర్మాణ,రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో ఏటేటా వృద్ధి సాధ్యపడుతోంది. ఏటా ఆయా రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. ఐటీ, అనుబంధ రంగాల్లో ఏటా సుమారు 1.59 లక్షల మందికి నూతనంగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరిలో మూడోవంతు ఉద్యోగులు ప్లాటు లేదా ఫ్లాటు కొనుగోలుకు ముందుకొస్తున్నారు. యాచారంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీ రియల్‌ రంగానికి చోదక శక్తిగా మారనుంది.

ఏటా 60 వేల నుంచి లక్ష ఇళ్ల అమ్మకాలు..
గ్రేటర్‌ నలుమూలలా జెట్‌స్పీడ్‌తో విస్తరిస్తున్న రియల్టీ,నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో ఇండిపెండెంట్‌ గృహాలు,ఫ్లాట్ల అమ్మకాలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. ఏటా సుమారు 60 వేల నుంచి లక్ష యూనిట్ల వరకు ఇళ్ల విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. ఈపరిణామం నిర్మాణ రంగ కంపెనీలకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. కోవిడ్‌ అనంతరం నిర్మాణ రంగంలో ఉపయోగించే సామాగ్రి,కార్మికుల వేతనాలు భారీగా పెరగడంతో ఇళ్ల ధరలు సుమారు 40 శాతం మేర పెరిగినా.. అమ్మకాల జోరు ఏమాత్రం తగ్గకపోవడం విశేషం.

మెట్రో నగరాలకు ధీటుగా..
దేశ రాజధాని ఢిల్లీ,వాణిజ్య రాజధాని ముంబాయి, గ్రీన్‌ సిటీ బెంగళూరు, పూణే నగరాలకు ధీటుగా నగరంలో నిర్మాణ రంగం పురోగమిస్తోంది. ఏటా నూతన ప్రాజెక్టులు,పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. ధరల విషయంలోనూ మన పొరుగున ఉన్న బెంగళూరు నగరంతో పోలిస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలోనే తక్కువ కావడం విశేషం. భౌగోళిక పరమైన అనుకూలతలు, మెరుగైన జీవనశైలి, జీవన వ్యయం అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండడం, మెరుగైన విద్య, ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్‌ నగరం ప్రత్యేకత. దీంతో ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందకు ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు,కార్మికులు మక్కువ చూపుతున్నారు. ఇటీవలి కాలంలో విదేశాల్లో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలు సైతం తమతోపాటు పిల్లలను కూడా ఇక్కడ సెటిల్‌ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

ప్రస్తుతం లగ్జరీ నివాసాల ట్రెండ్‌..
నగరంలో ప్రస్తుతం సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన విలాసవంతమైన విల్లాలు, లగ్జరీ ఫ్లాట్స్, ఆకాశ హార్మ్యాలను తలపించే హైరైజ్‌ అపార్ట్‌మెట్లలో ఫ్లాట్స్‌ కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం వీటికి బుకింగ్స్‌ పెరిగాయి. అమ్మకాలు ఊపందుకున్నాయి. నిర్మాణ రంగంలో సుమారు 30 శాతం లగ్జరీ సెగ్మెంట్‌ కాగా.. మరో 70 శాతం అఫర్డబుల్‌ హౌజింగ్‌కు ప్రాధాన్యత పెరిగింది.

రాబోయే ఐదేళ్లలో బడ్జెట్‌ ఇళ్లకు గిరాకీ అధికం..
ప్రస్తుతం లగ్జరీ ట్రెండ్‌ నడుస్తున్నప్పటికీ రాబోయే ఐదేళ్లలో ∙సుమారు వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే బడ్జెట్‌ ఫ్లాట్స్‌కే గిరాకీ పెరుగుతుంది. గ్రేటర్‌ నగరం నలుచెరుగులా విస్తరించడంతో నూతన కంపెనీలు ఔటర్‌రింగ్‌ రోడ్డు, రీజినల్‌ రింగ్‌రోడ్డు కేంద్రంగానే ఏర్పాటవుతున్నాయి. వీటిల్లో పనిచేసే ఉద్యోగులు,కార్మికులు ఆయా ప్రాంతాల్లో నూతనగా నిర్మించే అపార్ట్‌మెంట్లలో బడ్జెట్‌ ఫ్లాట్స్‌ కొనుగోలుతోపాటు ఆయా ప్రాంతాల్లో తక్కువ వ్యయంతో నిర్మించే సొంతిళ్ల కొనుగోలుకే ప్రాధాన్యతనివ్వడం తథ్యం.

క్రెడాయ్‌ ఆధ్వర్యంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ..
రాష్ట్ర వ్యాప్తంగా..అటు దేశ వ్యాప్తంగా నిర్మాణ రంగంలో పలు దిగ్గజ కంపెనీలకు కేరాఫ్‌గా ఉన్న క్రెడాయ్‌ సంస్థ ఆధ్వర్యంలో పలు శిక్షణా కార్యక్రమాలు చేపడుతుండడం విశేషం. స్వయం ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్, పెయింటింగ్‌ తదితర రంగాల్లో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నాము. న్యాక్‌ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 80 శాతం మంది నైపుణ్య కార్మికులు నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ యువత సైతం తమ విద్యార్హత, ఆసక్తిని బట్టి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ పొందిన పక్షంలో స్వయం ఉపాధి పొందే అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి.

ఈ మూడు ప్రాంతాలు కొంగు బంగారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న సంస్థలు,నూతన ప్రాజెక్టుల రాకతో సమీప భవిష్యత్‌లో వికారాబాద్, సంగారెడ్డి, కొల్లూరు ప్రాంతాలు గోల్డెన్‌ ట్రయాంగిల్‌ తరహాలో అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే భూముల ధరలు కోట్లు పలుకుతుండగా .. మరికొన్ని రోజుల్లో ధరలు ఆకాశాన్నంటుతాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి