మాంద్యం లేదు.. మంచి రోజులే

  • క్రెడాయ్‌ నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ గుమ్మి రాంరెడ్డి
  • మన దేశంలో రెసిషన్‌ ఛాయలు లేవు
  • రియల్‌ ఎస్టేట్,నిర్మాణ రంగానికి ఉజ్వల భవిష్యత్తు

    ధరణి బ్యూరో:
    మన దేశంలో ఆర్థిక మాంద్యం ఛాయలు అసలే లేవని..రియల్‌ ఎస్టేట్,నిర్మాణ రంగానికి రాబోయేవి అన్నీ మంచి రోజులేనని క్రెడాయ్‌(కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌) నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ గుమ్మి రాంరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న స్తబ్దత తాత్కాలికమేనని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం అటు దేశవ్యాప్తంగా..ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం శరవేగంగా పురోగమిస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుత రియల్‌ ఎస్టేట్,నిర్మాణ రంగంలో ట్రెండ్‌పై ప్రముఖ రియల్‌ ఎస్టేట్, నిర్మాణ, పర్యావరణ రంగాల సమగ్ర మాసపత్రిక, ‘ధరణీ మైత్రీ’ వెబ్‌సైట్‌ కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. విశేషాలివే..

    ధరణి: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా, ప్రత్యేకంగా తెలంగాణలో రియల్‌ ఎస్టేట్,నిర్మాణ రంగ పరిస్థితులు ఎలా ఉన్నాయి ?
    రాంరెడ్డి: ప్రస్తుతం దేశవ్యాప్తంగా,తెలంగాణలో ఈ రంగానికి ఎలాంటి ఢోకా లేదు. అమ్మకాలు,కొనుగోళ్లలో కాస్త స్తబ్దత నెలకొన్నప్పటికీ ఇది తాత్కాలికమే. రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో చిన్న పట్టణాల్లో సైతం రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగ కార్యకలాపాలు భారీగా పెరిగాయి.
    ధరణి: గ్రేటర్‌ హైదరాబాద్‌లో రియల్,నిర్మాణ రంగం పరిస్థితి ఎలా ఉంది?
    రాంరెడ్డి: కార్పొరేట్, ఎంఎన్‌సీలు వెల్లువలా నగరానికి తరలి వస్తున్నాయి. అన్ని వర్గాల్లో హైదరాబాద్‌పై మంచి అభిప్రాయం ఉంది. ప్రభుత్వ విధానాలు సైతం అనుకూలంగా ఉండడంతో ఈ రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి.
    ధరణి: రియల్‌ ఎస్టేట్,నిర్మాణ రంగంలో కొనసాగుతున్న వారికి మీరిచ్చే విలువైన సూచనలు ఏమిటి.?
    రాంరెడ్డి: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎవరూ ఈ రంగం భవిష్యత్తు,పెట్టుబడుల రాక, కొనుగోళ్లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ సదా, సర్వత్రా అప్రమత్తంగా ఉండడం ఉత్తమం.
    ధరణి: రాష్ట్రంలో కోవిడ్‌కు ముందు, ఆతరవాత భూముల ధరలు, నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో ధరల పెరుగుదల ఎలా ఉంది?
    రాంరెడ్డి: రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా భూముల ధరలు భారీగా పెరిగాయి. నిర్మాణ రంగంలో వినియోగించే స్టీలు,సిమెంటు ,ఎలక్ట్రికల్‌ తదితర సామాగ్రి ధరలు, ఉద్యోగుల వేతనాలు, దినసరి కార్మికుల కూలీలు సుమారు 30 నుంచి 40 శాతం పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు గతంతో పోలిస్తే వంద శాతం రెట్టింపు అయ్యాయి.
    ధరణి: నిర్మాణ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా మీరు కొనసాగుతున్నారు. మీ అనుభవం మేరకు ఏయే సంవత్సరాలు రియల్‌ ఎస్టేట్,నిర్మాణ రంగాలకు గోల్డెన్‌ పీరియడ్‌ అని భావిస్తున్నారు?
    రాంరెడ్డి: గత మూడేళ్లుగా ఈ రంగానికి గోల్డెన్‌ పీరియెడ్‌ అని చెప్పవచ్చు. అన్ని నిబంధనలు పాటిస్తూ వినియోగదారులకు నాణ్యమైన,మన్నికైన సేవలు అందిస్తూ..వారి పెట్టుబడులకు సరైన భద్రతనిస్తూ పలు సంస్థలు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతం అయ్యాయి. వినియోగదారుల మన్ననలు సైతం పొందాయి.
    ధరణి: మధ్యతరగతి వేతన జీవులు ఇండిపెండెంట్‌ హౌజ్, అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్,ఫామ్‌ప్లాట్‌..వీటిలో ఏది కొనుగోలు చేయడం మేలని మీరు సూచిస్తారు?
    రాంరెడ్డి: ప్రతీ వ్యక్తి తన బడ్జెట్‌కు లోబడి తమ ఆఫీసు, నివాసానికి సాధ్యమైనంత దగ్గరగా ఉండే చోట ఏదైనా కొనుగోలు చేయాలి. రోడ్, రవాణా కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలను ఎంచుకోవాలి. ఈ విషయంలో ఎవరి ప్రలోభాలకు లోనుకావద్దు. తమ పెట్టుబడికి అధిక లాభం వస్తుందన్న అంచనాలతో దూర ప్రాంతాల్లో కొనుగోలు చేయడం సరికాదు.
    ధరణి: ప్రస్తుతం మార్కెట్‌లోlజరుగుతున్న ప్రీలాంచ్‌ మోసాలపై మీ అభిప్రాయం?
    రాంరెడ్డి: ఇటీవలికాలంలో ఇలాంటి మోసాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తమ పెట్టుబడికి భద్రత, భరోసా నిచ్చే కంపెనీల వద్ద కొనుగోలుకే ప్రాధాన్యత నివ్వాలి. ఆయా కంపెనీల ప్రొఫైల్, అనుభవం, గతంలో చేపట్టిన ప్రాజెక్టులను క్షుణ్ణంగా పరిశీలించిన తరవాతనే కొనుగోలు చేయాలి. ధర కాస్త అధికమైనా..నమ్మకమైన చోట ఇన్వెస్ట్‌ చేయాలి.
    ధరణి: ప్రీలాంచ్‌ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు క్రెడాయ్‌ తరఫున మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు?
    రాంరెడ్డి: క్రెడాయ్‌ నేషనల్,తెలంగాణ చాప్టర్‌ల ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఈ రంగంలోని కంపెనీలు, వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యత నిస్తున్నాము. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశాము.
    ధరణి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి వెబ్‌ పోర్టల్‌ పనితీరు ఎలా ఉంది?
    రాంరెడ్డి: ఈ పోర్టల్‌లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. అత్యంత బిజీగా ఉండే కలెక్టర్‌లకు మాత్రమే లాగిన్‌ పవర్‌ ఇవ్వడం సరికాదు. సమస్య తీవ్రతను బట్టి తహసిల్దార్, ఆర్డీఓ స్థాయిల్లోనే ఆయా గ్రీవెన్స్‌ ను పరిష్కరించాలి.

    స్పందించండి

    మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి