నయా మాస్టర్‌ప్లాన్‌తో ఈ ప్రాంతాలు హాట్‌కేక్స్..
- జి.ఓ.111 స్థానంలో జి.ఓ.69 అమలు..
- నూతన మాస్టర్‌ప్లాన్ కోసం నిర్మాణ రంగ సంస్థల ఎదురుచూపులు
- సమగ్ర ప్రణాళికతో మరిన్ని భారీ ప్రాజెక్టులకు లైన్ క్లియర్
ధరణి బ్యూరో:
గ్రేటర్‌కు ఆనుకొని ఉన్న చారిత్రక జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన జి.ఓ.111 8pmస్థానంలో ఏడాది క్రితం సర్కారు జి.ఓ.69 ప్రవేశపెట్టడంతో సరిపెట్టకుండా.. నూతన మాస్టర్‌ప్లాన్ తయారీ చేయాల్సిన బాధ్యత ఉందన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నూతన జి.ఓ ప్రకారం మాస్టర్‌ప్లాన్ తయారీతో ఐటీకారిడార్,గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో పలు బహుళ అంతస్తుల ఆకాశ హార్మ్యాలనిర్మాణం ఊపందుకోనుంది. నూతన మాస్టర్‌ప్లాన్ కోసం పలు నిర్మాణ రంగ సంస్థలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. సవరించిన జి.ఓకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ సిద్ధంచేసి అందుబాటులోకి తీసుకొచ్చిన పక్షంలో.. ప్రధానంగా కొల్లూరు, తెల్లాపూర్, నల్లగండ్ల, గోపన్‌పల్లి, నానక్‌రాంగూడ, నార్సింగి, కోకాపేట్, పుప్పాల్‌గూడ, కొండాపూర్ ప్రాంతాలు మరింత హాట్‌కేక్‌గా మారనున్నాయి. ఈప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న భారీ ప్రాజెక్టులకు తోడు మరిన్ని నూతన ప్రాజెక్టుల నిర్మాణం ఊపందుకోనుంది. మరిన్ని విల్లా, హైరైజ్, అపార్ట్‌మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఆయా ప్రాంతాల్లో ధరలు సైతం ప్రస్తుతం ఉన్న ధరలను మించి ఆకాశాన్నంటనున్నాయి.
సమగ్ర మాస్టర్‌ప్లాన్ తప్పనిసరి..
ఒకవైపు జంటజలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే..నూతనంగా సిద్ధంచేయాల్సిన మాస్టర్‌ప్లాన్‌లో అవసరమైన నిబంధనలను పొందుపరిచే విషయంలో నగరంలో రెరాలో నమోదైన నిర్మాణ రంగ సంస్థల నుంచి విలువైన సలహాలు,సూచనలు తీసుకోవాలని బిల్డర్లు, రియల్టర్లు కోరుతున్నారు. జి.ఓ.111 ఎత్తివేసి దాదాపు ఏడాది కావస్తుండడంతో త్వరలో మాస్టర్‌ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అడ్డంకులు తొలగించడంతోపాటు..సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకున్న వినియోగదారుల ఆశలను సాకారం చేయాలని కోరుతుండడం విశేషం.