దేశవ్యాప్తంగా 10 లక్షల మంది టౌన్‌ప్లానర్ల కొరత!

  • నీతీ ఆయోగ్‌ తాజా నివేదికలో విస్తుగొలిపే వాస్తవాలు
  • టౌన్‌ప్లానింగ్‌లో నూతన మార్పులు,చేర్పులు అవసరం
  • దేశ జీడీపీలో పట్టణాల వాటా 65 శాతం


ధరణి బ్యూరో:
దేశంలో పట్టణ ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. కానీ టౌన్‌ప్లానర్ల కొరత తీవ్రంగా ఉన్నట్లు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. నీతి ఆయోగ్‌ తాజా నివేదికలో దేశంలో పలు పట్టణాల టౌన్‌ప్లానింగ్‌లోని లోపాలను ఎత్తిచూపింది. ఈ నివేదికలో పలు అంశాలు విస్తుగొల్పుతున్నాయి. మన దేశంలో సుమారు పది లక్షలమంది టౌన్‌ప్లానర్లకు కొరత ఉన్నట్లు అంచనా వేసింది. పలు వర్సిటీల్లో 26 రకాల టౌన్‌ప్లానింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ..ఏటా కేవలం 700 మంది టౌన్‌ప్లానర్లే అందుబాటులోకి వస్తుండడం గమనార్హం. సమగ్ర పట్టణ ప్రణాళిక రూపకల్పన,మౌలిక వసతుల కల్పన,ప్రభుత్వ–ప్రైవేటు రంగాలు,విద్య,పరిశోధన అభిద్ధికి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు టౌన్‌ప్లానర్ల ఆవశ్యకత అధికంగా ఉంది. ఇదే అంశాన్ని నీతి ఆయోగ్‌ సైతం స్పష్టం చేసింది. కాగా ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ,æ నగరాల్లో మౌలిక వసతుల కల్పన,ఆర్థిక లక్ష్యాల సాధనకు ఉపకరిస్తాయని నిపుణులు సూచిస్తుండడం విశేషం. పలు పట్టణాల అభివృద్ధికి సర్క్యులర్‌ ఎకానమీ అత్యావశ్యకం. నిత్యం వెలువడుతోన్న టన్నుల కొద్ద ఘన వ్యర్థాల శుద్ధి,మురుగు నీటి పునర్వినియోగం నగరాల్లో పారిశ్రామికాభివృద్ధికి దోహద పడతాయి. ప్రజారోగ్యానికి కీలకమైన పారిశుద్ధ్యం,స్వచ్ఛమైన గాలి,నీరు,విశాల రహదారులు,పచ్చటి పరిసరాలు,విద్య,వైద్యం తదితర మౌలిక వసతుల కల్పన సర్క్యులర్‌ ఎకానమీ అభివృద్ధికి దోహదం చేస్తాయని నీతి ఆయోగ్‌ స్పష్టంచేసింది. ఇందుకు అవసరమైన ఉప ప్రణాళికలు,వ్యూహాలను పట్టణాభివృద్ధి ప్రణాళికల్లో పొందుపరచాలని సూచించింది.


పలు నగరాల మాస్టర్‌ప్లాన్‌లో పలు లోపాలు..
దేశంలో ప్రస్తుతం సగం నగరాలకు అసలు మాస్టర్‌ప్లాన్లే లేవని నీతి ఆయోగ్‌ స్పష్టంచేయడం ఆందోళన కలిగిస్తోంది. మరికొన్ని నగరాల్లో మాస్టర్‌ప్లాన్‌లోని అంశాలకు,క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు లంకె కుదరడంలేదు. భూవినియోగం,జోనింగ్,భూ అభివృద్ధి వంటి అంశాలకే మాస్టర్‌ప్లాన్‌లు పరిమితమౌతున్నాయి. కానీ నగరంలో అత్యంత కీలకమైన రవాణా ప్రణాళిక కరువవుతోంది. రవాణా ప్రణాళికను భూ వినియోగ ప్రణాళికతో అనుసంధానం చేయడంలేదు. మౌలిక వసతుల కల్పనను సైతం పలు నగరాల మాస్టర్‌ప్లాన్‌లు విస్మరించాయి. మాస్టర్‌ప్లాన్‌ అమలుకు అవసరమైన నిధుల సమీకరణ,నిర్వహణ తదితర అంశాల ఊసెత్తకపోవడం పలు నగరాల మాస్టర్‌ప్లాన్ల డొల్లతనాన్ని స్పష్టంచేస్తోంది. ఇక దేశంలో సుమారు 7933 పట్టణ ఆవాసాల్లో 65 శాతానికి అసలు మాస్టర్‌ప్లాన్లు కరువవడం గమనార్హం. దీంతో అస్తవ్యస్తంగా నగరాల విస్తరణ,పర్యావరణ కాలుష్యం,వరదలు పోటెత్తడం వంటి సమస్యలతో పలు నగరాలు కునారిల్లుతున్నాయి. మరోవైపు పట్టణాల అభివృద్ధికి అవసరమైన భూమి లభించకపోవడం,భూమి కొనుగోలు ఖరీదుగా మారడం పట్టణ ప్రణాళిక అమలుకు అవరోధంగా నిలుస్తోంది. కాగా సమర్థ ప్రణాళికలతో నిర్మితమయ్యే నగరాలే దేశ భవితను నిర్ణయిస్తాయని ప్రధాని మోదీ సైతం పలు సందర్భాల్లో స్పష్టంచేశారు. ఈనేపథ్యంలో సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకొని మన దేశంలో పలు నగరాల్లో భూ,మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు పట్టణ ప్రణాళికలో అధిక ప్రాధాన్యతనివ్వాలి. పట్టణ ప్రణాళిక చట్టాలను కాలానుగుణంగా సమీక్షించి అవసరమైన మార్పులు చేయాలి. దేశంలో పలు వర్సిటీలు,ఐఐటీల్లో టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించి మరిన్ని అధునాతన కోర్సులు ప్రవేశపెట్టాలి. తద్వారా పట్టణాల సమ్మిళిత,సుస్థిర అభివృద్ధికి బాటలు వేయాలి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి