ఎంఈఐఎల్ సిగలో మరో మణిహారం
- మంగోలియాలో మెగా క్రూడ్ ఆయిల్ రిఫైనరీకి శ్రీకారం
- ప్రాజెక్ట్ విలువ 648 మిలియన్ అమెరికన్ డాలర్లు
- ఇప్పటికే రెండు ప్రాజెక్టులు చేపట్టిన మెగా సంస్థ
- మూడో ప్రాజెక్ట్ నిర్మాణ ఒప్పందం కరారు
ధరణిబ్యూరో:
ఇంజినీరింగ్ లెజెండ్.. ప్రముఖ ఇన్‌ఫ్రా సంస్థ.. మౌలిక వసతుల కల్పనలో భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్న మెగా ఇంజినీరింగ్ (ఎంఈఐఎల్) సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాకారం చేయనుంది. సాంకేతిక సవాళ్లు అత్యధికంగా ఉండే ప్రాజెక్టులను సవాలుగా స్వీకరించి పూర్తిచేసి దేశ, విదేశాల మన్ననలు పొందిందీ సంస్థ. తాజాగా మంగోలియాలో అత్యాధునిక క్రూడ్ ఆయిల్ రిఫైనరీని మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) నిర్మించనుంది. ఇది మంగోలియాలో సంస్థ చేపట్టనున్న మూడో భారీ ప్రాజెక్ట్. దీని విలువ 648 మిలియన్ అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ. 5400 కోట్లు. ఇటీవల మంగోల్ రిఫైనరీ సంస్థ నుంచి లెటర్ అఫ్ అగ్రిమెంట్‌ను మెగా సంస్థ అందుకుంది. రిఫైనరీ నిర్మాణ ఒప్పందంపై శుక్రవారం మంగోల్ రిఫైనరీ, మెగా ఇంజనీరింగ్ సంస్థల మధ్య మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లో ఒప్పందం జరిగింది. ఒప్పందంపై ఎంఈఐఎల్ ఎండీ పివి కృష్ణారెడ్డి సమక్షంలో మంగోల్ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అల్టాన్ట్సెట్సెగ్ దశ్దవా, ఎంఈఐఎల్ హైడ్రోకార్బన్స్ విభాగం అధ్యక్షుడు పి.రాజేష్ రెడ్డి సంతకాలు చేశారు. ఆయిల్ వెలికితీత, రవాణా, శుద్ధి రంగాల్లో ఇప్పటికే సేవలు అందించటంతోపాటు ఆన్‌షోర్, ఆఫ్‌షోర్æ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెగా సంస్థ మంగోలియా లో చేపట్టిన మూడో ప్రాజెక్ట్ ఇది. ఇప్పటికే మంగోలియాలో తొలి గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీని 598 మిలియన్ అమెరికన్ డాలర్లతో ఈ సంస్థ నిర్మిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 189 మిలియన్ల అమెరికన్ డాలర్లతో క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ను కూడా మెగా ఇంజినీరింగ్ నిర్మిస్తోంది. ఈ మూడు ప్రోజెక్టుల విలువ 1.436 బిలియన్ అమెరికన్ డాలర్లు.
ద్వైపాక్షిక వారధి..
ఒప్పందం అనంతరం మంగోల్ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అల్టాన్ట్సెట్సెగ్ దశ్దవా మాట్లాడుతూ.. భారత్, మంగోలియా దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు మంగోలియా రిఫైనరీ ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ అని చెప్పారు. రెండు దేశాల మధ్య ఎంతో కాలం నుంచి సుహృద్భావ∙సంబంధాలు ఉన్నాయని తెలిపారు. తమ దేశ అభివృద్ధిలో ఇండియా సహకారం ఎంతో కీలకమైందన్నారు. ఎంఈఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇండియా, మంగోలియా దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలకు తాము చేపట్టిన రిఫైనరీ పనులు ఒక ఉదాహరణ అని చెప్పారు. మంగోలియా లో తొలి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ నిర్మాణంలో భాగస్వామ్యం అయినందుకు తమకు గర్వకారణంగా ఉందన్నారు. నిర్ధేశిత కాలవ్యవధిలో తాము ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ రిఫైనరీ వల్ల మంగోలియా ఆర్ధికంగా అభివృద్ధి చెందటంతో పాటు, దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని అన్నారు.
ఇంజినీరింగ్ అద్భుతం..
ఈపీసీ పద్ధతిలో డీజిల్ హైడ్రోట్రేటర్ యూనిట్ (డిహెచ్‌డిటి), హైడ్రోక్రాకర్ యూనిట్ (హెచ్‌సియు), ఎంఎస్ బ్లాక్ (ఎన్‌హెచ్‌టి/ ఐఎస్ ఓఎం / ఎస్‌ఆర్‌ఆర్), విస్ బ్రేకర్ యూనిట్ (విబియు), హైడ్రోజన్ జనరేషన్ యూనిట్ (హెచ్‌జియూ), సల్ఫర్ బ్లాక్ (ఎస్‌ఆర్‌యూ / ఏఆర్ యూ /ఎస్‌డబ్ల్యూఎస్), ఎల్‌పీజీ ట్రీటింగ్ యూనిట్, హైడ్రోజన్ కంప్రెషన్, డిస్ట్రిబ్యూషన్, మ్యాచింగ్, ప్లాంట్ భవనాలు, శాటిలైట్ రాక్ రూమ్స్, సబ్‌స్టేషన్స్, ఇతర సౌకర్యాలను క్రూడ్ ఆయిల్‌లో రిఫైనరీలో ఎంఈఐఎల్ నిర్మించనుంది. మంగోలియాలో మైనస్ 35 డిగ్రీల నుంచి ప్లస్ 40 డిగ్రీల వాతావరణంలో క్రూడ్ ఆయిల్ రిఫైనరీని మెగా ఇంజినీరింగ్ నిర్మించనుండడం విశేషం. మంగోలియా దేశంలో ఉపయోగించేందుకు అనువుగా గాసోలిన్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్, ఎల్‌పీజీ తయారీకి ఉపయోగపడే 1.5 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ ను ఈ ప్రభుత్వ రంగ రిఫైనరీ ఉత్పత్తి చేయనుంది.
రేటింగ్‌లో టాప్ మెగా ఇంజినీరింగ్..
ఏ ఏ + రోబస్ట్ క్రెడిట్ రేటింగ్ ఉన్న ఎంఈఐఎల్ సంస్థ ప్రపంచంలోనే అత్యాధునిక రిగ్గులను తయారు చేసే తొలి ప్రైవేట్ సంస్థ. బెల్జియం, ఇటలీ, చీలి, అమెరికాలోని హూస్టన్, తాజాగా తూర్పు మంగోలియాలో తన సేవలను అందిస్తోంది. హైడ్రోకార్బన్స్ విభాగంలో సెపరేషన్ యూనిట్స్, డిస్టిలేషన్, డిసాల్టింగ్ ప్లాంట్స్, గ్యాస్ డిహైడ్రేషన్ సౌకర్యాలు, గ్యాస్ కంప్రెషన్ ఇన్‌స్టాలేషన్స్, గ్యాస్ పవర్ జనరేషన్ సెటప్స్, స్టోరేజ్ ట్యాంక్ సిస్టమ్స్, హైడ్రోకార్బన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్, స్ట్రక్చరల్, ప్లాంట్ పైపింగ్ పనులు మొదలైన వాటిని మేఘా ఇంజనీరింగ్ నిర్మిస్తోంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ జనరల్ మేనేజర్ వికల్ప్ పలివాల్, మంగోలియా ఎంపీటి ఇంక్ టు షాన్ , మంగోలియాలో భారత రాయబార కార్యాలయ ప్రతినిధి సంజీవకుమార్ తదితరులు పాల్గొన్నారు.