ఛలో సిటీస్..
2025 నాటికి 50 శాతం జనాభా పట్టణాల్లోనే
- తెలంగాణ వాసుల పట్నం బాట
- 2025 నాటికి 50 శాతం జనాభా పట్టణాల్లోనే
ధరణి బ్యూరో:
తెలంగాణ వాసులు పల్లెల్లో నివాసం కంటే పట్టణాల్లో స్థిరపడేందుకు అసక్తి చూపుతున్నట్లు తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. మరో రెండేళ్లలో సుమారు 50 శాతం మంది పట్టణాల్లో నివసించే అవకాశాలున్నట్లు నైట్‌ఫ్రాంక్ సంస్థ తాజా నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఇది 37 శాతంగా ఉండడం గమనార్హం. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పలు నగర పంచాయతీలు మున్సిపాల్టీలుగా మారడం, మరికొన్ని కార్పొరేషన్లుగా రూపాంతరం చెందడం, ఆయా నగరాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీఠ వేయడంతో సిటీలవైపు జనం దృష్టి సారిస్తున్నట్లు అర్భన్ ప్లానింగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎటువైపు చూసినా సుమారు 100 కిలోమీటర్ల వరకు పలు పట్టణాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఆయా ప్రాంతాలు నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు చెబుతున్నారు. ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమితమైన అభివృద్ధి..ఇప్పుడు ఆయా చిన్న నగరాలకు కూడా విస్తరించిందని విశ్లేషిస్తున్నారు. ఇక మన దేశవ్యాప్తంగా పరిశీలిస్తే పట్టణాల్లో జనాభా 2010లో 30 శాతం ఉండగా.. 2022 నాటికి ఏకంగా 37 శాతానికి పెరిగింది. ఇక 2030 నాటికి సిటీల్లో జనాభా దేశం మొత్తం జనాభాలో 40 శాతానికి పైమాటేనని ప్రపంచబ్యాంకు అంచనాలు వెల్లడిస్తున్నాయి.
దశాబ్దకాలంలో ఎంతో పురోగతి…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి పరిశీలిస్తే గడచిన 9 ఏళ్లలో నూతన జిల్లాలు, మండలాల ఆవిర్భావంతో ఆయా చిన్న నగరాల చుట్టూ రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పలు సిటీల్లో మౌలికవసతుల కల్పన ప్రాజెక్టులు పట్టాలెక్కడం, ఆయా నగరాల చుట్టూ పలు నూతన పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరగడం, నూతన ఇంజినీరింగ్, ఫార్మా తదితర వృత్తి విద్యా కళాశాలల ఏర్పాటు వంటి పరిణామాలన్నీ పల్లెవాసులు పట్నం బాట పట్టేందుకు కారణాలని నిపుణులు విశ్లేషిస్తుండడం గమనార్హం.