‘రియల్’ మెట్రో..
- గ్రేటర్ నలుచెరుగులా మెట్రో లుక్
- ఊపందుకోనున్న రియల్ రంగం
- శివార్లలో పెరగనున్న బూమ్
- నూతనంగా పలు రూట్లలో 415 కిలోమీటర్ల మార్గంలో మెట్రో
- రూ.69,100 కోట్లతో భారీ ప్రాజెక్టు
- ప్రతి కిలోమీటరుకు రూ.166 కోట్లకు పైగా వ్యయం
ధరణి బ్యూరో:
గ్రేటర్ సిటీ నలుచెరుగులా మెట్రో విస్తరణతో రియల్ ఎస్టేట్ బూమ్ ఆకాశాన్నంటనుంది. శివారు ప్రాంతాలు మెట్రో లుక్ సొంతం చేసుకోనున్నాయి. ట్రా ‘ఫికర్’ లేకుండా నగరం నలుమూలలను కవర్ చేస్తూ పలు రూట్లలో 415 కిలోమీటర్ల పరిధిలో సరికొత్త మెట్రో కారిడార్ సాకారం కానుంది. సుమారు రూ.69,100 కోట్ల భారీ అంచనా వ్యయం తో ఏర్పాటుచేయనున్న మెట్రో రెండు, మూడు దశల ప్రాజెక్టులు భాగ్యనగరంలో నవశకాన్ని ఆవిష్కరించనున్నాయి. ప్రతి కిలోమీటరుకు రూ.166 కోట్లకు పైగా వ్యయం చేస్తూ ఆయా రూట్లలో ఎలివేటెడ్, డబుల్ ఎలివేటెడ్ మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన నగరం నుంచి శివారు ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీ, మెట్రో రైల్ కనెక్టివిటీని భారీగా పెంచడం, ఫ్లైఓవర్లు, ప్రధాన రహదారుల విస్తరణతో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, ఐటీ, హార్డ్‌వేర్, మాన్యుఫాక్చరింగ్ తదితర రంగాలు జెట్ స్పీడ్‌తో దూసుకు వెళ్లే దిశగా ప్రభుత్వం పలు భారీ ప్రాజెక్టులను చేపడుతోంది. ఈ నయా ప్రతిపాదనల పట్ల ఆయా రంగాల నిపుణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సర్కారు విజన్ భవిష్యత్‌లో నగర పునర్నిర్మాణానికి బంగారు బాటలు వేస్తుందని ఆశిస్తుండడం విశేషం. ఇప్పటికే నగరంలో తొలిదశ మెట్రో ప్రాజెక్టు 69.1 కిలోమీటర్ల పరిధిలో మూడు రూట్లలో అందుబాటులో ఉన్న విషయం విదితమే.
ఈ ప్రాంతాల్లో రియల్ బూమ్ పీక్స్..
నూతన మెట్రో కారిడార్‌తో నగర శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు డబుల్ గ్రోత్‌ను సాధించే అవకాశాలున్నట్లు ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా బీహెచ్‌ఈఎల్, పటాన్ చెరు, ఇస్నాపూర్, ఎల్బీనగర్, హయత్ నగర్, పెద్ద అంబర్‌పేట్, శంషాబాద్, కొత్తూర్, షాద్‌నగర్, ఉప్పల్, ఘట్‌కేసర్, బీబీనగర్, తుక్కుగూడ, మహేశ్వరం, కందుకూర్, తార్నాక, ఈసీఐఎల్, జేబీఎస్, తూంకుంట, కండ్లకోయ, బొంగ్లూరు, శామీర్‌పేట్, మేడ్చల్, దుండిగల్, కోకాపేట్, నార్సింగి తదితర ప్రాంతాలు ఇన్వెస్టర్లు, డెవలపర్స్‌కు హాట్‌కేక్‌గా మారనున్నాయని అంచనా వేస్తున్నారు.
నూతన మెట్రో కారిడార్లు: కిలోమీటర్లు, అంచనా వ్యయం ఇదీ..
- బీహెచ్‌ఈఎల్–పటాన్‌చెరు–ఓఆర్‌ఆర్–ఇస్నాపూర్: 13 కి.మీ, రూ.3,250 కోట్లు .
- ఎల్భీనగర్–హయత్‌నగర్–పెద్ద అంబర్‌పేట్: 13 కి.మీ,రూ.3,250 కోట్లు.
- శంషాబాద్ జంక్షన్–కొత్తూర్–షాద్‌నగర్: 28 కి.మీ,రూ.6,800 కోట్లు
- ఉప్పల్–ఓఆర్‌ఆర్–ఘట్‌కేసర్–బీబీనగర్: 25 కి.మీ,రూ.6,900 కోట్లు
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్–తుక్కుగూడ ఓఆర్‌ఆర్–మహేశ్వరం ఎక్స్‌రోడ్–కందూకూర్: 26 కి.మీ, రూ.6,600 కోట్లు.
- తార్నాక–ఈసీఐఎల్: 8 కి.మీ, రూ.2,300 కోట్లు.
- జేబీఎస్–తూంకుంట: 17 కి.మీ, రూ.5,690 కోట్లు
- ప్యారడైజ్–కండ్లకోయ: 12 కి.మీ, రూ.4,400 కోట్లు
- ఓఆర్‌ఆర్ శంషాబాద్–తక్కుగూడ జంక్షన్–బొంగ్లూర్ జంక్షన్–పెద్ద అంబర్‌పేట్: 40 కి.మీ, రూ.5,600 కోట్లు
- ఓఆర్‌ఆర్ పెద్ద అంబర్‌పేట్ జంక్షన్–ఘట్‌కేసర్ జంక్షన్–శామీర్‌పేట్ జంక్షన్–మేడ్చల్ జంక్షన్: 45 కి.మీ,రూ.6,750 కోట్లు
- ఓఆర్‌ఆర్ మేడ్చల్ జంక్షన్–దుండిగల్ జంక్షన్–పటాన్‌చెరు జంక్షన్: 29కి.మీ, రూ.4,785 కోట్లు.
- ఓఆర్‌ఆర్ పటాన్‌చెరు జంక్షన్–కోకాపేట్ జంక్షన్–నార్సింగి జంక్షన్: 22 కి.మీ, రూ.3,675 కోట్లు.
- బీహెచ్‌ఈఎల్–లక్డికాపూల్–మియాపూర్: 26 కి.మీ, నాగోల్–ఎల్భీనగర్: 5 కి.మీ, అంచనా వ్యయం రూ.9.100 కోట్లు.