భూముల వేలం.. కాసులకు గాలం
- రియల్టర్ అవతారమెత్తిన సర్కార్
- రూ.వేల కోట్లు ఆర్జనే టార్గెట్‌గా ఆక్షన్
ధరణి బ్యూరో:
తెలంగాణ సర్కార్ ఇప్పుడు నయా రియల్టర్ అవతార మెత్తింది. రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో భూములకున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో భారీగా ప్రభుత్వ భూములను అభివృద్ధి చేసి ఈ–ఆక్షన్‌కు శ్రీకారం చుట్టింది. తాజాగాగా ఆగస్టు 7,8,9 తేదీల్లో మోకిల, షాబాద్, బోడుప్పల్ ప్రాంతాల్లో.. నూతనంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వెంచర్లలో ప్లాట్లను వేలం వేయనుంది. మూడు ప్రాంతాల్లో అన్ని మౌలిక వసతులు కలిగిన 150 ప్లాట్లను విక్రయించాలని లక్ష్యం నిర్దేశించుకుంది. ఇప్పటికే ఐటీ కారిడార్‌కు ఆనుకొని ఉన్న కోకాపేట్‌లో నియోపోలిస్ ఫేజ్–2లో సుమారు 45 ఎకరాల వేలం పాట ద్వారా రూ.2 వేల కోట్లు ఆర్జించాలని లక్ష్యం నిర్దేశించుకోవడం విశేషం.
హెచ్‌ఎండీఏ వెంచర్లకు భారీ డిమాండ్…
న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేని క్రిస్టల్ క్లియర్ టైటిల్స్, మున్సిపల్ పరిపాలన శాఖ నిబంధనలను పాటించడం, టీఎస్ రెరా మార్గదర్శకాలు అమలు చేయడం, అన్ని రకాల మౌలిక వసతులు, తీరైన రహదారులు, విద్యుత్ సరఫరా వ్యవస్థ, తాగు నీరు, డ్రైనేజి తదితర ఇన్‌ఫ్రాను తీర్చిదిద్దుతుండడంతోపాటు ప్రధాన ప్రాంతాలకు కనెక్టివిటీని ఏర్పాటు చేస్తుండడంతో హెచ్‌ఎండీఏ వెంచర్లు ఇప్పుడు హాట్‌కేక్‌లా మారాయి. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంపాటలు గ్రాండ్ సక్సెస్ అవడంతోపాటు సర్కారుకు కాసుల వర్షం కురిపించిన విషయం విదితమే. మధ్యతరగతి వర్గం, వేతన జీవులతోపాటు ప్రముఖ రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ సంస్థలు, ఎన్‌ఆర్‌ఐలు, ఇన్వెస్టర్లు ఇప్పుడు హెచ్‌ఎండీఏ వెంచర్లలో సైట్స్ కొనుగోలుకు అమితాసక్తి చూపిస్తుండడం నయా ట్రెండ్‌గా మారింది.
తాజా ఈ–ఆక్షన్ షెడ్యూల్ ఇదీ..
మోకిల ప్రాంతంలో 50 ప్లాట్లకు ఆగస్టు 7న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆక్షన్ నిర్వహించనున్నారు. షాబాద్ ప్రాంతంలో నెలకొల్పిన వెంచర్‌లోని 50 ప్లాట్లకు ఆగస్టు 8న వేలం పాట నిర్వహించనున్నారు. బోడుప్పల్‌లోని 50 ప్లాట్లకు ఆగస్టు 9న ఈ–వేలం నిర్వహించనున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. ఈ ప్లాట్ల వేలానికి సంబంధించి ప్రీబిడ్ సమావేశాలను ఈనెల 21,22,25 తేదీల్లో నిర్వహించనుంది. ఆసక్తిగలవారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆగస్టు 7 వరకు సమయమిచ్చారు. ఇతర వివరాలకు http://www.hmda.gov.in/auctions/ అనే సైట్‌ను సంప్రదించాలి.